బాబు – బిల్లీ రావు బాగోతం

బాబు – బిల్లీ బాగోతం

‘‘2003లో నాటి సీఎం చంద్రబాబు ‘ఐఎంజీ అకాడమీస్ భారత’ అనే బోగస్ సంస్థకు కోట్ల విలువైన 850 ఎకరాల భూములను కట్టబెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రీడా ప్రాంగాణాల ఏర్పాటు పేరుతో అక్రమాలకు తెరలేపారు. ఆ ఐఎంజీ బోగస్ సంస్థను ఏర్పాటు చేసిన అహోబలరావు (బిల్లీరావు), ప్రభాకర రావు (పేటరావు) బాబుకు అత్యంత సన్నిహితులు. దీనికి ముందే ఈ ఇద్దరికీ చెందిన బీహెచ్‌సీ ఆగ్రో సంస్థకు కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని అమలు చేసే ప్రాజెక్టును ఆయన అప్పగించారు.

2003 ఆగస్టు 5న లక్ష రూపాయల క్యాపిటల్‌తో బిల్లీరావు, పేటరావు ఐఎంజీ సంస్థను ఏర్పాటు చేశారు. కనీసం కార్యాలయం కూడా లేని ఈ సంస్థకు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, మామిడిపల్లి గ్రామ సమీపంలోని 450 ఎకరాలను కేటాయిస్తూ రూపొందించిన 40 పేజీల అవగాహ న ఒప్పందానికి ఆగస్టు 6న బాబు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అంటే కంపెనీ ఏర్పడిన ఒక్క రోజులోనే ఒప్పంద రూపకల్పన తోపాటు ఆమోదం లభించింది. ఇక 9వ తేదీన సంబంధిత ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. అంటే కంపెనీ పుట్టిన తేదీ నుంచి, ఒప్పందంపై సంతకాల వరకు మూడు రోజుల్లోనే ప్రభుత్వ పరంగా అన్ని వ్యవహారాలకూ ఆమోదం వచ్చింది. దాంతోపాటు ఆ సంస్థకు రకరకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ బాబు జీవోలు విడుదల చేశారు.

2004 ఫిబ్రవరిలో తాను ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఐఎంజీకి విక్రయిస్తూ ఆగమేఘాలపై చంద్రబాబు రిజిస్టర్ చేయించారు. అక్కడ మార్కెట్ విలువ రూ.3 కోట్లు ఉండగా.. బాబు ఆ సంస్థకు ఎకరం రూ.50 వేలకే విక్రయించారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్/మేనేజింగ్ కమిటీ ఆ భూములకు చట్టబద్ధమైన యజమానులైనప్పటికీ.. ఒప్పందంపై యూనివర్సిటీ వైస్ చాన్సెలర్‌కు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. దాంతోపాటు శంషాబాద్ సమీపంలోని మామిడిపల్లిలో 450 ఎకరాల భూములను ఎకరం రూ.50 వేలకే(రిజిస్ట్రేషన్ సమయంలో రూ.25 వేలు మాత్రమే చెల్లించేలా) ఐఎంజీకి విక్రయించేందుకు నిర్ణయించారు. వాస్తవానికి అక్కడ ఎకరం విలువ రూ.కోటి ఉంది.

అదే ఒప్పందం కింద హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ చంద్రబాబు ఐఎంజీకి 45 ఏళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయించారు. ఉద్యోగుల జీతభత్యాలకు, నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.2.50 కోట్ల ప్రజాధనాన్ని ఇవ్వజూపారు. 45 ఏళ్ల తర్వాత ఆ స్టేడియంలను కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఐఎంజీకి కల్పించారు. అయితే అవగాహన ఒప్పందం తేదీకి ముందు ఉన్న భూముల విలువలో నుంచి.. ఐఎంజీ మెయింటెనెన్స్ వ్యయాలను తీసివేయగా వచ్చే ధరకు కొనుక్కునేలా.. క్లాజులు పెట్టారు. సంస్థ ఏర్పాటు తేదీల నుంచి మొదలు, ఒప్పందంలోని క్లాజుల వరకు అన్ని విషయాల్లోనూ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్ని విధాలా ఐఎంజీ సంస్థకే ప్రయోజనాలు చేకూరేలా, ప్రభుత్వ ఖజానాకు పూర్తి స్థాయి నష్టాలు జరిగేలా చంద్రబాబు వ్యవహరించారన్నది ఇందులో స్పష్టమవుతోంది.

ఇజ్రాయిల్ సాగు పేరుతో మరో కుంభకోణం 

కుప్పంలో 9,572 ఎకరాల్లో ఇజ్రాయెల్ తరహా సేద్యాన్ని అమలు చేసి… రెండోదశలో రంగారెడ్డి జిల్లాలో అమలు చేసి… ఆ తర్వాత దాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించాలని 1997లో చంద్రబాబు ప్రభుత్వం  నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను బిల్లీ, ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ ప్యాట్‌రావుకు చెందిన ‘బీహెచ్‌సీ ఆగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు అప్పగించేశారు బాబు. సేద్యంలో ఇజ్రాయెల్ తరహా విప్లవాన్ని తెస్తామని, స్వర్గాన్ని తెచ్చి కుప్పంలో కూర్చోబెడతామని రకరకాల డబ్బాలు వాయించింది ఈ కంపెనీ. షరా మామూలుగా ఈ డబ్బాను రాష్ట్రమంతటికీ వినిపించేలా కొట్టింది ‘ఈనాడు’. రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోబోతోందంటూ ఊదరగొట్టేశారు రామోజీరావు. కానీ కుప్పంలో మాత్రం పరిస్థితి అడ్డం తిరిగింది.

ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టుకు రూ.19 కోట్లు ఖర్చుచేశారు. దీన్లో కొంత టెక్నాలజీకి, కొంత మౌలిక సదుపాయాలకు, మరికొంత యంత్రాలకు అంటూ మొత్తం బిల్లీ చేతిలో పోసేశారు. ఈ ప్రాజెక్టుతో ఎంత విధ్వంసానికి దిగారో చెప్పడానికి మాటలు చాలవు. ప్రాజెక్టు కోసమని రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూముల్లో సరిహద్దులను మళ్లీ మానవ మాత్రుడెవరూ గుర్తించలేనంతగా చెరిపేశారు. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడేశారు. దాంతో చుట్టుపక్కల భూముల్లో కూడా భూసారం నాశనమైపోయింది. చుట్టుపక్కల రైతులు అప్పటిదాకా 200 అడుగుల బోర్లు వేస్తే… ఈ భూముల్లో ఏకంగా 600 అడుగుల లోతున బోర్లు వేశారు. దీంతో చుట్టూ ఉన్న బోర్లు ఎండిపోయి రైతులు భోరుమన్నారు. ఎకరానికి రూ.30,000- 50,000 వరకూ ఫలసాయం అందిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసినా… ఎకరాకు రూ.3 నుంచి 5 వేలు కూడా దిగుబడి సాధించలేకపోయారు. ప్రాజెక్టు పేరిట ఎకరాకు చేసిన ఖర్చుకు బ్యాంకు వడ్డీని సైతం ఫలసాయంగా రాబట్టలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కుప్పం ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ‘ఆంధ్రప్రదేశ్  కొయిలిషన్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ డైవర్సిటీ’ తరఫున శాస్త్రవేత్తలు, నిపుణులు కుప్పం వెళ్లొచ్చి.. ఒక నివేదిక రూపొందించారు. దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెల్లడించారు.

కుప్పంలో భూమి వాలుకు సమాంతరంగా దున్ని… బిల్లీ-బాబులు తమ వ్యవసాయ అజ్ఞానాన్ని ఘోరంగా బయటపెట్టుకున్నారు. ఆ ఫొటోలు దినపత్రిక ల్లో చూసి రాష్ట్ర రైతాంగం నోరెళ్లబెట్టింది. ఎందుకంటే భూమి సహజమైన వాలుకు అడ్డంగా దున్నటం సంప్రదాయం. అలా కాక వాలుకు సమాంతరంగా దున్నితే మట్టి కొట్టుకుపోవటాన్ని ఎవ్వరూ ఆపలేరు. కోసివేతతో నేల శాశ్వతంగా నష్టపోతుంది. నిరక్షరాస్యులైన రైతులకు తెలిసిన కనీస పరిజ్ఞానాన్ని సైతం బిల్లీ కంపెనీ ప్రదర్శించలేకపోయింది. మరి దీన్ని ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటారా? ఇజ్రాయెల్‌లో ఇలానే చేస్తారా? ఇది రాష్ట్ర ప్రజలను వంచించటం కాదా? ఇజ్రాయెల్ పేరిట కుప్పంలోను, అమెరికా పేరిట ఐఎంజీని సృష్టించి హైదరాబాద్‌లోను వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి పథకం వేశారంటే… వీళ్లని ఏమనుకోవాలి? దోపిడీలో విదేశాలకెక్కిన చరిత్ర వీళ్లది కాదా? కేబినెట్ అనుమతి లేకుండా… అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీకి భూములు కట్టబెట్టారంటే చంద్రబాబును చరిత్ర క్షమిస్తుందా?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *